Vinayaka Vrata Kalpam - వినాయక వ్రతకల్పం_16

| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |

(vinayaka chavithiganapathi pujavinayaka vrata kalpamవినాయక చవితిగణపతి పూజ,గణపతి పూజా విధానంవినాయక వ్రతకల్పం)
16)  శమంతకోపాఖ్యానం (ద్వాపర యుగం)

 ఓరోజు శ్రీకృష్ణుడు ద్వారకకు తనని చూడవచ్చిన నారదుణ్ని భక్తిగా పూజించాడు. ఇద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. సాయంసంధ్యా సమయంలో నారదుడు లేచి సెలవు తీసుకుంటూ శ్రీకృష్ణుడితో చెప్పాడు.
 ‘‘స్వామీ! ఇవాళ భాద్రపద శుద్ధ చవితి. వినాయకుడి కారణంగా పార్వతి శాపం వల్ల ఇవాళ చంద్రుణ్ని చూడరాదు. చూస్తే నీలాపనిందలు తప్పవు. కాబట్టి వెళ్లొస్తాను. సెలవిప్పించండి’’
 శ్రీకృష్ణుడికి ఆ శాప విషయాలన్నీ వివరించి నారదుడు స్వర్గానికి వెళ్లిపోయాడు. దాంతో శ్రీకృష్ణుడు ఆ రాత్రి చంద్రుణ్ని ఎవరూ చూడరాదని పట్టణంలో చాటింపు వేయించాడు.
 పాలంటే ఇష్టం కల శ్రీకృష్ణుడు ఆ రాత్రి బయటకు వచ్చి, తలె త్తి ఆకాశం వంక చూడకుండా గోశాలకి పోయి పాలు పితుకుతుంటే, పాల గిన్నెలో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది.
 ‘‘ఆహా! చూడకూడని దినాన చంద్రుణ్ని చూశాను కదా! ఆ శాప ఫలితంగా నాకేం నీలాపనిందలు రానున్నాయో’’ అనుకున్నాడాయన.
 ఇలా కొంతకాలం గడిచింది. శ్రీకృష్ణుడి రాజ్యంలో సత్రాజిత్తు అనే అతనుండేవాడు. అతను సూర్యుణ్ని పూజించి, శమంతకమణిని సంపాదించాడు. అతనో రోజు శ్రీకృష్ణుడిని చూడటానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి తగిన మర్యాదలు చేశాక ఆ శమంతకమణి రసక్తి రాగానే కృష్ణుడు దాన్ని తనకిమ్మని సూచించాడు.
 ‘‘అమ్మో! ఇదిరోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తూంటుంది. ఇంత విలువైన మణిని ఎలా ఇస్తాను?’’ తిరస్కరించాడు సత్రాజిత్తు.
 ‘‘సరే నీ ఇష్టం’’ అన్నాడు కృష్ణుడు.
 -----
 
 మరికొంత కాలం గడిచాక సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ శమంతకమణిని మెళ్లో ధరించి, వేటాడటానికి వెళ్లాడు. ఓ సింహం ఆ మణిని చూసి అది మాంసం ముక్క అని పొరబడి ప్రసేనుడి మీదకు ఉరికి చంపేసింది. ఆ మణిని నోట కరచుకునొ వెళ్లే ఆ సింహాన్ని ఓ మగ ఎలుగుబంటి చూసి చంపాడు. ఆ మణితో తన నివాసస్థలానికి వెళ్లి తన కుమార్తె జాంబవతికి ఆ మణిని ఆడుకోవడానికి ఇచ్చాడు.
 వేటకు వెళ్లి తిరిగిరాని తమ్ముడి కోసం సత్రాజిత్తు అడవికి మనుషులను పంపితే మణి లేని అతని శరీరం వారికి కనిపించింది. వారంతా వెంటనే వచ్చి ఆ సంగతి చెప్పారు. సత్రాజిత్తు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ని చంపి ఆ మణిని దొంగిలించాడని భావించి నగరమంతా చాటింపు వేయించాడు.
 ఈ సంగతి శ్రీకృష్ణుడికి తెలిసింది. భాద్రపద శుద్ధ చవితినాడు తను పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూడటం వల్ల వచ్చిన నీలాపనిందగా దాన్ని గుర్తించాడు. బంధుమిత్రులతో వెంటనే శ్రీకృష్ణుడు అడవికి వెళ్లి ప్రసేనుడి శవాన్ని, పక్కనే ఉన్న సింహపు కాలి గుర్తులను చూశాడు. వాటిని అనుసరించి వెళ్తే, అక్కడ చ చ్చి పడి వున్న సింహాని పక్కన గల ఎలుగుబంటి పాదాల గుర్తులను గమనించాడు. ఆ కాలి గుర్తునలు అనుసరించి వెళ్తే, అవి పర్వతంలోని గుహద్వారం దాకా వెళ్లాయి. తన వెంట వచ్చినవారిని అక్కడే వుండమని శ్రీకృష్ణుడు ఒంటరిగా ఆ గుహలోకి వెళ్లాడు. 
 గుహలోని ఊయలకి ఆట వస్తువుగా కట్టి వున్న శమంతకమణిని చూసి, దాన్ని తీసుకుంటూండగా శ్రీకృష్ణుడిని చూసిన జాంబవతి భయపడింది.
 ‘‘నాన్నా! ఎవరో వింతమనిషి నా మణిని తీసుకుంటున్నాడు చూడు’’ అని గట్టిగా అరిచింది.
 జాంబవంతుడు కోపంతో వచ్చి శ్రీకృష్ణుడిని చూసి, అతని పైబడి కోరలతో కొరుకుతూ, గోళ్లతో గుచ్చుతూ చంపడానికి ప్రయత్నించాడు. శ్రీకృష్ణుడు ఆ ఎలుగుబంటిని కిందకు తోసి రాళ్లతోనూ, వృక్షాలతోనూ, పిడి గుద్దులతోనూ ఎదుర్కొన్నాడు. అలా 28 రోజులపాటు వారి మధ్య యుద్ధం సాగింది. క్రమేపీ జాంబవంతుడి బలం క్షీణించింది. దెబ్బలు తినడం వల్ల అతని దేహమంతా నొప్పులే. తన బలాన్ని క్షీణింపచేయగలిగింది రావణుని చంపిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు జాంబవంతుడు. వెంటనే శ్రీకృష్ణునికి నమస్కారం చేస్తూ, భక్తితో కూడిన వినయంతో చెప్పాడు.
 ‘‘దేవాదిదేవా! నువ్వు త్రేతాయుగంలో రావణుడు, ఇతర దుష్ట రాక్షసులను చంపడానికి అవతరించిన శ్రీరామచంద్రుడవని అర్థమైంది. ఓ సారి నువ్వు నామీద ప్రేమతో ఏదైనా వరం కోరుకోమంటే, బుద్ధిమాలి మీతో ద్వంద్వం యుద్ధం చేయాలని వుందని చె ప్పాను. సమయం వచ్చినప్పుడు అదిజరుగతుందని నువ్వు చెప్పావు. అప్పటినుంచి, అనేక యుగాలుగా నీ నామాన్నే స్మరిస్తూన్నాను. నా ఇంటికే వచ్చి నువ్వు నా కోరికను తీర్చావు. ధన్యుడిని. నా శరీరం అంతా నలిగి బాధగా ఉంది. నువ్వే నన్ను దయతో కాపాడు’’
 శ్రీకృష్ణుడు జాంబవంతుడి వంక దయగా చూస్తూ తన చేత్తో అతని శరీరాన్ని ఓసారి నిమిరాడు. అంతే!
 జాంబవంతుడి బాధలన్నీ మాయం అయి పూర్వపు శరీరాన్ని పొందాడు.
 అప్పుడు శ్రీకృష్ణుడు తను వచ్చిన పనిని జాంబవంతుడికి వివరించాడు.
 ‘‘జాంబవంతా! నేను శమంతకమణిని దొంగిలించానని నా మీద అభియోగం వచ్చింది. నాకు ఆ మణినిచ్చి నేను ఆ అపనిందను పోగొట్టుకునేలా చెయ్యి’’
 ‘‘స్వామీ! అలాగే. ఈ మణేకాక, నా కూతురు జాంబవతిని కూడా నీభార్యగా నీకు సమర్పిస్తాను. దయచేసి స్వీకరించు’’ కోరాడు జాంబవంతుడు.
 అలా జాంబవంతుడికి అల్లుడై, కృష్ణుడు గుహలోంచి మణి, భార్యామణితో బయటికి వచ్చాడు. శ్రీకృష్ణుడికేమైందో అని బయట ఆదుర్డాగా వేచి వున్నవారంతా బాధడుతున్నారు. అతన్ని చూడగానే వారంతా ఆనందంతో జయజయధ్వానాలు చేశారు.
 కృష్ణుడు అందరితో కలిసి తన నగరానికి వెళ్లి, సత్రాజిత్తుని పిలిచి, శమంతకమణిని అతనికి ఇచ్చి, ఆ మణి ఎలా మాయమైందో వివరించాడు.
 ‘‘అయ్యో! లేనిపోని నింద మీమీద మోపి తప్పు చేశాను’’ అని సత్రాజిత్తు బాధపడ్డాడు.
 తన తప్పిదానికి పరిహారంగా సత్రాజిత్తు తన కూతురు సత్యభామను శ్రీకృష్ణునికి భార్యగా, ఆ శమంతకమణితో పాటు ఇచ్చాడు. కృష్ణుడు మణిని తిరస్కరించి, సత్యభామను మాత్రం స్వీకరించాడు.
 ఓ శుభముహూర్తాన శ్రీకృష్ణుడు, సత్యభామలకు వివాహం జరిగింది. ఆ వివాహానికి వచ్చిన దేవతలు, మునులు శ్రీకృష్ణుడితో మొరపెట్టుకున్నారు.
 ‘‘మహాత్మా! మీరు సమర్థులు కాబట్టి చవివిన చంద్రుడిని చూడగా మీ మీద వచ్చిన అపనిందను తొలగించుకోగలిగారు. మాలాంటి అసమర్థుల మాటేమిటి? మీరే తగిన పరిష్కారం చెప్పాలి’’
 కృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పాడు.
 మీరు ప్రతి ఏడూ భాద్రపద శుద్ధ చవితినాడు గణపతిని పూజించి, గణపతి పుట్టుక నుంచి, ఈ శమంతకోపాఖ్యానం దాకా మొత్తం కథ విని, లేదా చదివి అక్షింతలు తల మీద చల్లుకుంటే, ఆరాత్రి చంద్రుని చూసినా ఎవరికీ ఎలాంటి నీలాపనిందలూ కలగవు.’’ ఈ రోజు నుంచి వినాయకుడు విఘ్నాలకు అధిపతియే కాక, గణాలకు కూడా అధిపతి అవుతాడు. కాబట్టి గజాననుడు ఇక నుంచి విఘ్నేశ్వరుడు, గణాధిపతి అనే పేర్లతో కూడా పిలువబడతాడు’’
 అది విన్న అందరూ సంతోషించారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం  భాద్రపద శుద్ధ చవితినాడు దేవతలూ, మహర్షులూ, మానవులూ మొదలైనవారంతా తమ శక్తికొలదీ వినాయకుడిని పూజించి ఈ కథ విని లేదా చదివి సుఖంగా వున్నారు.
 సూత మహాముని ఆ కథను శౌనకుడు, ఇతర మునులకు చెప్పాక, వారి దగ్గర సెలవు తీసుకుని తన నివాసస్థానానికి వెళ్లాడు.

 ఓం విఘ్నేశ్వరాయ నమః
 
లోకంలోని సమస్త ప్రాణికోటికి శుభం కలుగుగాక.
 
వినాయక వ్రత కల్పం సమాప్తం

0 comments:

Post a Comment