(vinayaka chavithi, ganapathi puja, vinayaka vrata kalpam, వినాయక చవితి, గణపతి పూజ,గణపతి పూజా విధానం, వినాయక వ్రతకల్పం)
14) విఘ్నాలకి అధిపతి ఎవరు?
ఓ రోజు అనేకమంది దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, పూజించి చెప్పారు.
‘‘స్వామీ! విఘ్నాలతో మా పనులు చాలా చెడిపోతున్నాయి. ఈ విఘ్నాలను శాసించేందుకుగాను మాకో అధిపతిని ఇవ్వండి. ఆయన్ని పూజించి విఘ్నాలు కలుగకుండా చూసుకుంటాము’’
తన పిల్లలలో ఒకరికి ఆ ఆధిపత్యాన్ని ఇవ్వాలని శివుడు సంకల్పించాడు. అది తెలిసిన గజాననుడు తండ్రిని అడిగాడు.
‘‘నేను పెద్ద కొడుకుని కనుక ఆ ఆధిపత్యము నాకివ్వండి నాన్నగారు’’
రెండో కొడుకు కుమారస్వామి తండ్రితో చెప్పాడు.
‘‘నాన్నగారూ! అన్నయ్య మరుగుజ్జు. అందుచేత అసమర్థుడు, అనర్హుడు అవుతాడు. ఆ ఆధిపత్యం నాకివ్వండి’’
వారి వాదలను విన్న శివుడు వారితో చిరునవ్వుతో చెప్పాడు.
‘‘పిల్లల్లారా! మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదుల్లో స్నానం చేసి నా వద్దకు వస్తారో వారిని అందుకు అర్హులుగా నిర్ణయించి, వారికి ఆ ఆధిపత్యాన్ని ఇస్తాను. వెంటనే బయలుదేరండి’’
ఆ మాటలు వినీవినగానే కుమారస్వామి నెమలినెక్కి ఆ పని మీద రివ్వున బయలుదేరాడు. వినాయకుడు తన ఎలుక వంక విచారంగా చూసి తండ్రితో చెప్పాడు.
‘‘నాన్నగారూ! ఎలుకనెక్కి వెళ్లి నేను తమ్ముడి కన్నా ముందుగా అన్ని నదుల్లో స్నానం చేసి రాలేను. నేను ఈ పోటీలో గెలిచే ఉపాయం మీరే చెప్పండి’’
అప్పుడు శివుడు కొడుకుతో చెప్పాడు.
‘‘కుమారా! ఎవరు ఒకసారి నారాయణ మంత్రాన్ని జపిస్తారో వారు మూడు వందల కల్పాల కాలం, పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు’’
‘‘అలా అయితే ఆ మంత్రాన్ని ఉపదేశించండి నాన్నగారూ’’ ఉత్సాహంగా అడిగాడు గజాననుడు.
తండ్రి ఆ మంత్రోపదేశం చేయగానే గజాననుడు కైలాసంలో అత్యంత భక్తిగా ఆ మంత్రాన్ని స్మరించసాగాడు.
---------
మొదటగా కుమారస్వామి గంగానదికి వెళ్లగా, అప్పటికే గంగలో స్నానం ముగించి, ఎదురొస్తున్న అన్నయ్య గజాననుడు ఎదురుపడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. కుమారస్వామి మూడుకోట్ల ఏభైలక్షల నదుల్లో స్నానానికి వెళ్లినా మంత్రమహిమ వల్ల గజాననుడు స్నానం చేసి ఎదురు రావడం కుమారస్వామికి కనిపించసాగింది. ఆఖరిస్నానం కూడా పూర్తి చేసి, ఎంతో ఆశ్చర్యంతో కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరకు వెళ్లి పశ్చాత్తాపంతో చె ప్పాడు.
‘‘నాన్నగారూ! అన్నగారి మహిమ తెలియక ఇందాక ఏదేదో మాట్లాడాను. నాకన్నా అన్నయ్యే అన్నివిధాలా సమర్థుడు కనుక గజాననుడినే విఘ్నాలకి అధిపతిని చేయండి’’
ఆ ప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం వేడుకని జరిపించాడు. అప్పటి నుంచి అంతా విఘ్నేశ్వరుడిగా పిలువబడే గజాననుడిని ఆ రోజు పూజించి, వడపప్పు, పానకం, అరటిపండ్లు, తేనె, పాలు, కొబ్బరి, అతనికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్లు ఇతర పిండివంటలను నైవేద్యంగా పెట్టసాగారు.
-------
ఆ భాద్రపద శుద్ధ చవితిన భూలోకంలో తనకు నైవేద్యం పెట్టిన వాటన్నిటినీ సుష్టుగా తిని విఘ్నేశ్వరుడు తన వాహనమైన ఎలుకకి కొన్ని పెట్టి కొన్ని చేతుల్లో తీసుకుని భుక్తాయాసంతో సూర్యాస్తమయ వేళకి మెల్లిగా కైలాసం చేరుకున్నాడు.
తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వంగి నమస్కారం చేయటానికి ప్రయత్నించాడు. అయితే తిన్నవాటితో కడుపు ఉబ్బిన వినాయకుడు నేల మీద బోర్లా పడుకొన్నాడు. పొట్ట మీద నిలిచిన చేతులు భూమికి అందలేదు. బలవంతంగా చేతులను భూమికి ఆనిస్తే, కాళ్లు పైకి లేవసాగాయి.
ఇలా సాష్టాంగ నమస్కారం చేయడానికి అవస్థ పడే విఘ్నేశ్వరుడిని చూసిన, శివుడి తలలోని చంద్రుడికి వినోదం కలిగి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా పిండవుతాయంటారు. ఈ సామెత నిజమన్నట్లుగా వినాయకుడి పొట్ట పగిలి అందులోంచి ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి నేల మీద దొర్లాయి. విఘ్నేశ్వరుడు మరణించాడు.
తక్షణం గర్భశోకంలో మునిగిన పార్వతి చంద్రుడి వంక కోపంగా చూసి ఈ విధంగా శపించింది.
‘‘దుర్మార్గుడా! నీ చూపు తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవారంతా నీలాపనిందలతో బాధపడుదురుగాక!’’







0 comments:
Post a Comment